KCR logo
KCR logo
ewedw

సమగ్ర వ్యక్తిత్వం సంక్లిష్ట తత్వం

కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు/ సన్నిహితుడై కూడా దూరం వాడు/ ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కాని/ తన ఎడాన్ని మాత్రం కాపాడుకుంటడు ॥ అని కాళోజీ తన సోదరుడు ‘షాద్‌ రామేశ్వరరావు గారు, పీవీ గురించి రాసిన హిందీ కవితను అనువదిస్తూ చెప్పారు. పీవీ వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని విశ్లేషించడానికి కాళోజీ కవితోక్తులు ఉపకరిస్తాయి. చీకటి, వెలుగుల నడిమి సంధ్యాకాలం వంటివారు పీవీ. అసమాన ప్రతిభా సంపత్తితో పరిపూర్ణ వ్యక్తిత్వంతో భాసించిన పీవీలో అనేక ధోరణులుండటంతో ఆయన స్వభావంలో సంక్లిష్టత గోచరిస్తుంది. అసలు పీవీ పేరులోనే రెండు రూపాలు (నర/సింహం) కనిపిస్తున్నాయి.

పీవీని తొలినాళ్ళ నుంచి ఆద్యంతం ఎరిగిన అతి సన్నిహితులలో కాళోజీతో పాటు, కాకతీయ పత్రికను నిర్వహించిన రచయిత పాములపర్తి సదాశివరావుగారు కూడా ఉన్నారు. పీవీని కాళోజీ తన ‘నా గొడవ’లో – వల్మీకం వామన పూర్వరావు వల జిక్కిన ఎందుకు పనికిరావు’ అని కూడా వ్యంగ్యోక్తితో రాశారు. అయితే వామనుడే త్రివిక్రమావతారమెత్తినట్లు, పీవీ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగి అపర చాణక్యుడిగా, రూజ్‌వెల్ట్‌ గా సంస్కరణల పితామహునిగా ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడినాడు.పీవీ ఏ ముహూర్తంలో స్వామీ రామానంద తీర్థుల వారి చేత కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో, ఆ వేళ నుంచి, తుది శ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యునిగానే ఉండిపోయారు. పార్టీలో ఎన్ని సంక్షోభాలు సంభవించినా ఏనాడూ పార్టీని వీడిపోవాలని భావించలేదు. అయితే తాను పార్టీకే గాని, పార్టీని నడిపే పెద్దలకు విధేయుడిని కానని, తొలుత రాజీవ్‌ గాంధీకి, అనంతరం సోనియమ్మకు స్పష్టంగా చెప్పి, తన అంతరంగాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రకటించారు.

పీవీలో నీతి, నిజాయితీలతో పాటు నిర్మొహమాటం, నిర్భీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రజలకు మంచి చేయడం కోసమే, రాజకీయాల్లోకి వచ్చారు. తనకు కేటాయించిన ప్రతి మంత్రిత్వశాఖకు వన్నె తెచ్చారు. భూ సంస్కరణల వల్ల తన పదవికే ముప్పు వాటిల్లుతుందని తెలిసినప్పటికీ, ఆర్డినెన్స్‌ జారీ చేయించిన ధైర్యశాలి. ముల్కీ రూల్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి, తెలంగాణకు న్యాయం జరుగుతుందని సంతసించిన నిష్పక్షపాతి.

పీవీ తనలోని వైరుధ్యాన్ని, సంక్లిష్టతత్వాన్ని, తానే మారుపేరుతో ‘న్యూ స్వతంత్ర టైమ్స్‌’ పత్రికకు రాసిన వ్యాసంలో ఉటంకించడం విశేషం.

‘pv narsimharao considerd as an unpredictable personality due to intellectual status, not so easy do acess and evaluate అని పేర్కొని తనలో పరస్పర విరుద్ధ తత్వాలను తెలియజేశాడు. ఆయన కవి- కాని తాత్వికుడు. ఆయనలో ఆధునికుడున్నాడు, సంప్రదాయవాదీ వున్నాడు. ఆయన సంఘజీవియే. కానీ ఒంటరితనాన్ని కోరుకుంటాడు అని తన స్వభావం గురించి వివరించారు. పీవీ నిజ జీవితంలో నటించకున్నా, నటన అన్నా, నాటకాలన్నా, సినిమాలన్నా ఇష్టపడేవారు. స్వీడిష్‌ అమెరికన్‌, ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి, ‘గ్రేటాగార్బొ’ (1905-1990)ను పీవీ ఒక దేవతగా ఆరాధించాడు. సౌందర్యారాధనలో ఉండిపోలేదు. స్వామీ రామానంద తీర్థ వద్ద సన్యాస దీక్షలో శిక్షణ పొందారు. ‘బాల్‌జాక్‌’, అలెన్‌ పొ కవులను ఎంత శ్రద్ధగా చదువుతారో అంతే ఆసక్తితో రామన్‌ ఎఫెక్ట్‌ను విశ్లేషించగలుగుతారు.

సాహితీవేత్తగా పీవీ అన్ని ప్రక్రియలు స్పృశించారు. అనువాద రచయితగా రాణించారు. సహస్రఫణ్‌, అబలా జీవితం, ఇన్‌ సైడర్‌, అయోధ్య మొదలైనవి ఆయనలోని వైరుధ్యాలను, సంఘర్షణలను ఆవిష్కరించే విశిష్ట రచనలు. పీవీ గణితశాస్త్ర కోవిదుడు. అయితే న్యాయశాస్త్రం చదివి, గోల్డ్‌మెడల్‌ సాధించారు. కాన్‌స్టిట్యూషన్‌ లా బాగా తెలిసినవాడు. అందుకే భారతరాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించారు. పీవీకి క్రికెట్‌ అంటే పిచ్చి. అధిష్ఠానం ఏ మంత్రినైనా తొలగిస్తే ‘ఒక వికెట్‌ పడింది’ అని క్రికెట్‌ భాషలో వెల్లడించేవారు. అయితే సాయంత్రాల్లో షటిల్‌ ఆడేవారు. ఇలా పలురంగాలలో, శాస్ర్తాలలో, భాషలలో ఒకదానికొకటి పొంతనలేని అంశాలలో ప్రావీణ్యం సంపాదించి సైతం నిరహంకారంతో నిగర్విగా ఉండటం ఆయనకే చెల్లింది.

పీవీ తన జ్ఞాన విజ్ఞానాలను నిరంతరం, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకొనేవాడు. కంప్యూటర్‌ సైన్స్‌ పరిజ్ఞానం లేని తరానికి చెందిన పీవీ పట్టుదలతో కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకొని ‘యునికోడ్‌’ ఆవిష్కరించేంతవరకు వెళ్లి తన తరాన్ని యువతరాన్ని ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, సాఫ్ట్‌వేర్‌ వారిని సైతం నివ్వెరపరిచారు. పీవీ కంప్యూటర్‌ పరిజ్ఞానానికి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీయే విస్తుపోయి, తనకు అందులో ప్రవేశం లేనందున, పీవీ హాస్యమాడే వాడని వెల్లడించారు. నిర్ణయం తీసుకోవడంలో పీవీ తీవ్ర జాప్యం చేస్తాడని నిర్ణయాలు తీసుకోకపోవడమూ ఒక నిర్ణయమేనని, పీవీ గురించి ఇదే పుస్తకంలో ప్రణబ్‌ ముఖర్జీ తెలియజేశారు. (పుట: 157) ఆరు నెలల్లో జరగాల్సిన పని ఆరు రోజులలో, ఆరు రోజులలో జరగాల్సిన పనిని ఆరు నెలల్లోనూ పూర్తిచేసే మనస్తత్వం గలవాడని పీవీ మిత్రుడు పాములపర్తి సదాశివరావు వ్యాఖ్యానించారు.

మేధావిగా, ఆరితేరిన రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా సంస్కరణశీలిగా మహోన్నత శిఖరాలకు చేరిన పీవీ వ్యక్తిగత జీవితంలో ఒక మహిళ ప్రవేశించి దాదాపు దశాబ్దకాలం పాటు, మీడియాకు మసాలా అందించారు. లోకం తమను గమనిస్తుందని తెలిసీ, పీవీ ఈ విషయంలో నిగ్రహించుకోలేకపోయారని ఆయన ‘ఇన్‌సైడర్‌’ నవలే చెబుతుంది. ఇన్‌సైడర్‌’ నవలలో ఆనంద్‌-అరుణల మధ్య స్నేహ ప్రణయబంధాన్ని చాలా పేజీల్లో నిస్సంకోచంగా చిత్రించారు. పీవీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఆమె ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్లి సన్యాసినిగా మారింది. యోగిగా మారాల్సిన పీవీ అనూహ్యంగా ప్రధానిగా అవతరించారు. తనలో ఏ దాపరికము లేదని చెప్పడానికే ఇన్‌సైడర్‌ నవలలో అంతరంగ ప్రణయాన్ని చర్చించారు పీవీ. (గాంధీజీ గారి ‘సత్యంతో నా ప్రయోగాలు’ వలె)

పీవీ సమగ్ర వ్యక్తిత్వాన్ని ఆయన రచనలు, నిర్వహించిన పదవులు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాలతోనే కాదు, ఆయన ప్రసంగ వ్యాసాల ద్వారా కూడా అంచనావేయాలి. ఆయన ప్రసంగాలను భారతప్రభుత్వం, కేంద్ర, సమాచార ప్రసారశాఖ, ప్రచురణల విభాగం, ఐదు సంపుటాలుగా ముద్రించింది. 2500 పుటలలో 400 పై చిలుకు ప్రసంగ వ్యాసాలతో పాటు, ప్రెస్‌ కాన్ఫరెన్సులు, ఇంటర్వ్యూలు ఈ సంపుటాలలో ఉన్నాయి. ప్రచురించబడినవి. ఇవన్నీ చదివితే పీవీ విరాట్‌ స్వరూపం విదితమవుతుంది. పీవీ రచనలను, వ్యాసాలను, ప్రసంగాలను, దాదాపు పదిహేనేండ్లుగా ఆధ్యయనం చేస్తున్నాను. ఎప్పుడు చదివినా ఏదో ఒక కొత్త అంశం బయటపడటాన్ని గమనిస్తున్నాను.

ధర్మరాజు సమగ్ర వ్యక్తిత్వం గలవాడు. అజాతశత్రువు. కానీ మానావమానాలు ఓర్చుకున్నాడు. ధర్మమే జయిస్తుందని విశ్వసించాడు. ద్రౌపది వస్ర్తాపహరణం సమయంలో నిస్సహాయుడై ధర్మం కోసం ఉండిపోయాడు. వనవాసం చేశాడు… చివరికి ఒంటరియైనాడు. పీవీ ముఖ్యమంత్రి పదవిని కొల్పోయినా, బాబ్రీమసీదు విధ్వంసాన్ని చూసినా, తనవాళ్లే తరిమికొట్టినా సత్యధర్మాలను నమ్ముకొని ఒంటరిపోరాటం చేసారు.

ఒక వ్యాసంలోనో, గ్రంథంలోనో విశ్లేషించగలిగే సులభమైన వ్యక్తికాదు పీవీ. ఆయనొక ప్రత్యేక అధ్యయనం. పీవీ స్టడీ సెంటర్‌ నెలకొల్పితే, పరిశోధనలు జరిగితే, అనంతర కాలంలో భవిష్యత్తరానికి మరో మహనీయుని గురించి స్ఫూర్తినందించిన వారమవుతాము.

వ్యాసకర్త: ఆకాశవాణి ప్రయోక్త
పీవీ మేధావి ఒప్పుకొన్నాం.. తెలుగుఠీవీ.. ధ్రువీకరించాం. అంతకుమించి ఆయనే స్వీయకవితలో విరోధబాసలో పేర్కొనట్టుగా విప్లవతపస్వి.. మామూలు విప్లవ తపస్వికాడు.. నవభక్తుల, రక్తుల, శక్తుల మేళవించి నవనిర్మిత జాతి సంతరించిన.. విప్లవ తపస్వీ!

డాక్టర్‌ వీవీ రామారావు