KCR logo
KCR logo
ewedw

పీవీకి న‌చ్చిన ఆహారం ఏంటో తెలుసా?

పీవీ నరసింహారావు పరిపూర్ణ శాకాహారి. అందులోనూ మితాహారి. నచ్చితే రెండు ముద్దలు ఎక్కువ తినడం, నచ్చకపోతే కడుపు మాడ్చుకోవడం.. ఆయన తత్వం కాదు. మధ్యాహ్న భోజనంలో పప్పు, చారు తప్పనిసరి. వాటితోపాటు ఒకట్రెండు కూరలు మామూలే! పళ్లాన్ని చూసి మనిషి స్వభావాన్ని అంచనా వేయొచ్చని చెబుతారు. ఆయనలోని నిర్మోహత్వం కంచంలోనూ కనిపించేది.

 

 

రసరాజం.. చారు!

నాలుగు చింతపండు రెక్కలుంటే చాలు కమ్మని చారు సిద్ధమవుతుంది. పడిశం పట్టినప్పుడు మిరియాల చారు, పప్పన్నానికి జతగా ధనియాల చారు, స్పెషల్‌ డిష్‌గా టమాట చారు.. అబ్బో చారు లిస్ట్‌ చాంతాడంత. జీర్ణశక్తిని పెంచడంలో చారుది కీలక పాత్ర. పీవీగారి దృష్టిలో చారు.. ‘ఇండియన్‌ టానిక్‌’

తప్పనిసరి పప్పన్నం

పంచభక్ష్య పరమాన్నాలు ఎన్నున్నా పప్పు బువ్వతోనే భోజనం మొదలవుతుంది. కుతకుతలాడుతూ పప్పు ఉడుకుతుంటే వచ్చే వాసన ఆకలిని రెట్టింపు చేస్తుంది. ముద్దపప్పులో కాసింత నెయ్యి తగిలించామా జఠరాగ్ని ఊపందుకొని ఆహారాన్ని ఇట్టే అరిగింపచేస్తుంది. ఆకుకూరల పోషకాలను శరీరానికి అందించే అసలైన వంటకం పప్పు. మేలైన మాంసకృత్తుల ఖజానాగా పప్పును చెబుతారు. పెద్దాయనకు పప్పన్నం లేకపోతే ముద్ద దిగేదికాదని అంటారు.

గొప్పరుచి.. గుమ్మడి

కాయగూరల్లో వెయిటైనది గుమ్మడి. ఘన పంచరత్నాలుగా పేరున్న కూరల్లో గుమ్మడికి చోటుందంటే దానికెంత పేరుందో చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా గుమ్మడి పులుసు పెట్టుకుంటారు. వడియాలు పెట్టుకుంటారు. అదే గుమ్మడితో చేసే బరడా తింటే జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది. ఆలుగడ్డ, బుడమకాయతో వండిన బరడాకన్నా గుమ్మడితో చేసిందైతే మరింత బేషుగ్గా ఉంటుందని పీవీసాబ్‌ నిశ్చితాభిప్రాయమని చెబుతారు.

వంకాయకు వందనం

కూరల్లో రారాజు వంకాయ, నేతలకే నేత పీవీ! వంకాయ అంటే నచ్చని వారుండరు. పాములపర్తివారూ అందుకు మినహాయింపు కాదు. వంకాయలో విటమిన్‌-బి ఎక్కువ. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. పీవీ సాబ్‌.. మితంగా తిన్నా, అమిత ఇష్టంగా తినేవారట.. గుత్తొంకాయ కూరను!

భళా..బెండకాయ

బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయన్నది పెద్దలమాట. పీవీ తెలివితేటలకూ బెండకాయలకూ ఏమైనా సంబంధం ఉందేమో పరిశోధకులే తేల్చాలి. లేత బెండకాయలను చూడగానే ఆకలి పుడుతుంది. చిన్న ముక్కలుగా కోసి, పైపైన వేయించి, ఆపై కొద్దిగా పచ్చికొబ్బరి వేసి వేగనిస్తే బెండకాయ రుచికి ఫిదా అయిపోవాల్సిందే. చల్ల పులుసులో, సాంబారులో తేలాడే బెండకాయ ముక్కలు జుర్రుకునే కొద్దీ రుచి.