KCR logo
KCR logo
ewedw

నిజమైన భారత రత్నం

‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్‌ విశ్రాంత అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రేవూరి అనంత పద్మనాభరావు

‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. నిస్వార్థ సేవా తత్పరులు. ఎవరితో ఏ విషయాలు, ఎంతవరకు చర్చించాలనే మర్మం తెలిసిన, మనసులోని భావాలను అదుపులో పెట్టుకోగల స్థితప్రజ్ఞులు. పేద, ధనిక, తక్కువ, ఎక్కువ అనేది చూసేవారు కాదు. సామాన్యుల్లో సామాన్యుడు’ అని వివరిస్తున్నారు ఢిల్లీ దూరదర్శన్‌ విశ్రాంత అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రేవూరి అనంత పద్మనాభరావు. పీవీ శతజయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆయనతో తనకున్న జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

పీవీ నరసింహారావుతో మీ పరిచయం..?
నేను ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు 1984లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అప్పుడాయన విదేశాంగ మంత్రి. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రసంగం రికార్డింగ్‌ చేయడానికి స్టూడియోకు వచ్చారు. మా డైరెక్టర్‌తో మాట్లాడిన అనంతరం పక్కనే ఉన్న నన్నుచూసి ‘హౌ ఆర్‌యూ పద్మనాభరావ్‌’ అంటూ పలకరించారు. నేను వారిని కలవడం అదే ప్రథమం. ఆశ్చర్యంలో మునిగిపోయా. తర్వాత ఆరా తీస్తే ఢిల్లీ కేంద్రం వారు రేడియో రికార్డింగ్‌ కోసం పీవీకి నా కాంటాక్ట్‌ నెంబర్‌ ఇచ్చారని తెలిసింది. తరచూ రేడియో సంబంధింత కార్యక్రమాలపై వారు ఆరా తీస్తుండేవారు. ఢిల్లీకి వచ్చిన సాహితీవేత్తలు ఆయనను కలుద్దామంటే తీసుకెళ్తుండేవాడిని.

పీవీతో మీకున్న మరచిపోలేని జ్ఞాపకాలు ఏమిటీ?
నా మొదటి పరిచయమే ఒక మరచిపోలేనిది. ఆ రోజు రేడియో ప్రసంగం రికార్డింగ్‌ అయ్యాక పీవీ వెళ్తూ నాలుగ్గంటల్లోపు రాజ్‌భవన్‌ గెస్ట్‌హౌజ్‌కు వచ్చి ఆ టేపు ఇవ్వండి. రేపే ఢిల్లీ నుంచి ప్రసారం కాబట్టి ఆ టేప్‌ను మీ ఆకాశవాణికి చేరే ఏర్పాటు చేస్తానని చెప్పారు. మరుసటిరోజు ఆ టేపును అందించాను. నా ఉద్యోగ జీవితం తదితర విషయాలన్నీ ఆరా తీశారు. నేను అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఢిల్లీకి బదిలీ అయ్యాను కానీ, అప్పటికే పీవీ ప్రధానిగా పనిచేసి దిగిపోయారు. 1998లో అనుకుంటా ఫోన్‌ చేశారు. ‘ఆకాశవాణి ఇటీవల కొన్ని కర్ణాటక, హిందూస్థానీ సంగీతం ఆడియో సీడీలు విడుదల చేసిందని విన్నాను. అవి ఎక్కడ దొరుకుతాయి’ అని మృదువుగా అడిగారు. ఆకాశవాణి భవన్‌లోని ఆర్కైవ్స్‌ విభాగానికి వెళ్లి అక్కడి మిత్రులతో మాట్లాడి ఏడెనిమిది ఆడియో సీడీలు ప్యాక్‌ చేయించుకొని మర్నాడు అందించాను. హైదరాబాద్‌ కవి పండితులు, ముఖ్యంగా రావూరి భరద్వాజ గురించి అడిగారు. ఆ తర్వాత ఢిల్లీలో అనేకసార్లు పీవీని కలిశాను. అలాగే 1994లో పీవీ నంద్యాల సభ విశేషాలను నేను స్వయంగా రికార్డు చేయడం మరచిపోలేను.

పీవీ నర్సింహారావు ఔన్నత్యాన్ని వివరిస్తారా..?
పీవీ రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులను అలకరించినా నిరాడంబరంగానే జీవించారు. చాలా మృదుస్వభావి. ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో భాగంగా ఢిల్లీ సిరిఫోర్డ్‌ ఆడిటోరియంలో సంగీత కచేరి ఏర్పాటుచేశాం. ఆ కచేరి ఆహ్వాన పత్రికను పీవీకి స్వయంగా అందించాను. రెండు, మూడు సీట్లు ఖాళీ పెట్టమన్నారు. కచేరి రోజు సాయంత్రం ఆయన పీఏ ఫోన్‌ చేశారు. ‘సెక్యూరిటీ వాళ్లు వెళ్లగూడదని చెప్పారు. సార్‌ సారీ చెప్పమన్నారు అనడం’ పీవీ ఔన్నత్యానికి నిదర్శనం. మా రేడియో కార్యక్రమాల్లో కొత్తదనం తీసుకురండి. ఒకప్పుడు దేవులపల్లి, బందా వంటి పర్సనాలటీస్‌ పనిచేశారంటూ ఎప్పుడూ సలహాలిచ్చేవారు. రేడియో ప్రాభవం కోల్పోవడంపై క్లుప్తంగానే అయినా హెచ్చరించేవారు. ఎంతటి వారితోనైనా తన భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్తారు.

పీవీ రేడియో ప్రసంగాలను స్వయంగా రికార్డ్‌ చేశారు కదా. అందులో విశేషాలు ఎలా ఉండేవి?
సాధారణంగా ప్రధానులు, ముఖ్యమంత్రుల ప్రసంగాలన్నింటినీ వారికి చెందిన మీడియా సలహాదారులు ఏర్చి కూర్చి పెడుతుంటారు. పీవీకి పీవీఆర్‌కే ప్రసాద్‌ మీడియా అడ్వైజర్‌గా ఉండేవారు. కానీ పీవీ నాకు తెలిసీ ఎప్పుడూ వాటిని యథాతథంగా ప్రసంగించేవారు కాదు. మీడియా సలహాదారులు ఇచ్చిన ప్రసంగానికి మెరుగులు అద్దేవారు. సరళమైన భాషలో, సామెతలతో కలిపి ప్రసంగించేవారు. ఆయన ప్రసంగం చిన్న పిల్ల కాలువలా మొదలై ప్రవాహంలా సాగిపోయేది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు..
ప్రధానిగా పీవీ రాజనీతిజ్ఞతతో దేశాన్ని అనేక విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించారు. విప్లవాత్మక సంస్కరణలతో నవభారత నిర్మాణానికి పునాదులు వేశారు. సాహితీవేత్తగా ఎనలేని సేవ చేశారు. స్వయంగా రచనలు చేయడమే గాక భారతీయ కళలను కాపాడేందుకు కృషిచేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన నేత. నిజంగా భారత రత్నం. అయినప్పటికీ ఇంతకాలం ఆయన సేవలు మరుగుపడిపోయాయి. కొందరు మరుగున పడేశారనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రద్ధ వహించి పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా, దేశవిదేశాల్లో నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. దేశానికి పీవీ చేసిన సేవలను భావితరాలకు తెలియజేసేలా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నా ధన్యవాదాలు.

పీవీ గురించి మీ మాటల్లో..
పీవీ బహుభాషావేత్త. కవి, కథకుడు, నవలాకారుడు, ఆత్మకథాశిల్పి, అనువాదకుడు. అద్భుత ప్రసంగకర్త. నిత్య పఠనశీలి. నేను ఎప్పుడు కలవడానికి వెళ్లినా పీవీ చేతిలో పుస్తకం కనిపించేది. బహుముఖీన ప్రజ్ఞ. ఒదిగి ఉండే తత్త్వం. స్నేహితులు, బంధువులు, సాహితీవేత్తలపై ఎనలేని అభిమానం చూపేవారు. నేను కలిసిన ప్రతిసారీ రాజకీయాలు కాకుండా హైదరాబాద్‌లో ఉండే తన మిత్రుల, రచయితల యోగక్షేమాలను అడిగేవారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ పేదలకు ఎంతో ఉపయోగకరమైనది. కానీ సంతృప్తికరంగా పనిచేయడం లేదు.. బియ్యం, గోధుమలతో పాటు మరికొన్ని వస్తువులను ఈ వ్యవస్థ ద్వారా పేదలకు అందించవలసి ఉన్నది. అగ్గిపెట్టెల వంటివి కూడా చౌకధరల దుకాణాల ద్వారా అందించాలి. ఈ కొత్త విధానం ద్వారా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయి.

  • పీవీ నరసింహారావు

ఇంటర్వ్యూ:
మ్యాకం రవికుమార్‌
94929 10065